========================================================================================
% అలమేలుమంగనీ వభినవరూపము (వాల్యూం 12-159)
అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ
శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ
========================================================================================
% వలదననొరులకు (వాల్యూం 4-17)
వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె
తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె
పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను
మెలుతచికురధ మ్మిల్లపురాహువు
తలచెదరగనిది దైవమెచేసె
వనితకువాడునొ వలపుతాపమున
తనులతికయనుచు తమకమున
ఘనవేంకటపతి కౌగిటచమటల
తనివి దీర్చనిది దైవమె చేసె
========================================================================================
% పురుషోత్తముడవీవు (వాల్యూం 2-53)
పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోననాయందు మంచితనమేది
అనంతాపరాధములు అటునేముసేసివి
అనంతమైనదయ అది నీది
నినునెఱగకుండేటి నీచ గుణము నాది
ననునెడయకుండేటి గుణము నీది
సకలయాచకమే సరుసనాకుపని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను
వెకలివైనను గాచేవిధమునీది
నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపమునీది
========================================================================================
% భక్తికొలది వాడే (వాల్యూం 1-410)
భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు
పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు
పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు
========================================================================================
% ఏమొకో చిగురుటధరమున (వాల్యూం 12-82)
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
========================================================================================
% తెలిసిన వారికి దేవుండితడే (వాల్యూం 3-480)
తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల
పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు
పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు
వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి
గాదిలి మతులను గైకొనడితడు
========================================================================================
% కొలిచిన వారల (వాల్యూం 3-419)
కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు
యినవంశాంబుధి నెగసిన తేజము
ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకుల నిథానమితడు
పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళ సూత్రము
ధరలో రామావతారంబితడు
చకితదానవుల సంహారచక్రము
సకలవన చరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు
========================================================================================
%అంతరంగమెల్ల (వాల్యూం 1-437)
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
యెదుట తాను రాజైతే ఏలేనాపరము
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
========================================================================================
% భక్తినీపై దొకటె పరమసుఖము (వాల్యూం 3-322)
భక్తినీపై దొకటె పరమసుఖము
యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు
కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు
ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము
యెనయగ పరమ పద మించుకయులేదు
తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా
పెరిగె నానందంబు బెళకులికలేవు
========================================================================================
% విశ్వరూపమిదివో (వాల్యూం 3-409)
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము
మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము
కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
========================================================================================
% అవధారు రఘుపతి (వాల్యూం 3-492)
అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
యివలనిండే కొలువిదెనదె సముఖాన
రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు
మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో
యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర
కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజసము చెప్పరాదు రామ
========================================================================================
% రామచంద్రుడితడు (వాల్యూం 10-147)
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
========================================================================================
% పలువిచారము లేల (వాల్యూం 3-100)
పలువిచారములేల పరమాత్మనీవు నాకు
కలవు కలవు ఉన్న కడమలేమిటికి
నీపాదముల చెంత నిబిడమైతే చాలు
యేపాతకములైన ఏమిసేసును
యేపార నీభక్తి ఇంత గలిగిన చాలు
పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు
సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు
నేరకవేసిన చాలు నీమీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను
యేరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను
========================================================================================
% ఇతరములిన్నియు (వాల్యూం 1-86)
ఇతరములిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుటపరము
ఎక్కడి సురపుర మెక్కడి వైభవ
మెక్కడి విన్నియునేమిటికి
యిక్కడనే పరహితమును పుణ్యము
గక్కున జేయగ గలదిహ పరము
యెవ్వరు చుట్టములెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగు లక్ష్మీరమణుని దలపుచు
యివ్వలదా సుఖియించుట పరము
యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెఱిగి వేంకటగిరి రమణుని
చిందులేక కొలిచినదిహ పరము
========================================================================================
% నారాయణాచ్యుతానంత (వాల్యూం 2-423)
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు
యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే
========================================================================================
% ఏటి సుఖము (వాల్యూం 1-135)
ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము
కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము
నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము
ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము
========================================================================================
% నవనీతచోర (వాల్యూం 3-24)
నవనీతచోర నమోనమో నవమహిమార్ణవ నమోనమో
హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ
నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణ నమోనమో
నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమోనమో
వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర
నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజనుత నమోనమో
========================================================================================
% ఆలాగు పొందులును (వాల్యూం 1-30)
ఆలాగు పొందులును అటువంటి కూటములు
యీలాగు లౌటనేడిదె చూడనైతి
అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలనిలోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసిబొందితిగాని
యెడలేని పరితాప మెఱగలేనైతి
చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలుపలేనైతి
వరుసమోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనైతి
శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
యీ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి
========================================================================================
% రాముడు లోకాభిరాముడు (వాల్యూం 2-219)
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే
వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే
ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే
బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే
========================================================================================
% కొలనిలోన (వాల్యూం 2-214)
కొలనిలోనమునుగోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు
పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు
నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు
పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు
========================================================================================
% అమరాంగనలదె (వాల్యూం 10-26)
అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు
గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు
ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు
అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు
========================================================================================
% పసిడియక్షంతలివె (వాల్యూం 3-194)
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని
కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి
పందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని
అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
========================================================================================
% పాపపుణ్యముల రూపము (వాల్యూం 1-28)
పాపపుణ్యముల రూపము దేహమిది దీని
దీపనంబణగింప తెరువెందులేదు
అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతి బొందరాదు
మతిలోని దేహాభిమానంబు బిడుచుటకు
రతిపరా~జ్ముఖుడు గాక రవణంబు లేదు
సరిలేని మమకారజలధి దాటినగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపుని గొలిచినగాని
పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు
========================================================================================
% సకలశాంతికరము (వాల్యూం 3-377)
సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ
మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును
చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానబాయును
కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల
కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా
అయమైన నీ శరణాగతిచే నణగు
========================================================================================
% చాలుచాలును (వాల్యూం 12-45)
చాలుచాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ
ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌగిలే వదలె
పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప
పొందుగాదట యేటి పొందురా ఓరీ
నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచిన అంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేటి వలపురా ఓరీ
కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ
నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ
========================================================================================
% తరుణినీయలుక (వాల్యూం 12-70)
తరుణినీయలుకకెంతటిది ఇంతినీ వేళ
కరుణించగదర వేంకటశైలనాథ
ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు
ఒక మారు విధిసేతలూహించి పొగడు
ఒక మారు తనుజూచి వూరకే తలవూచు
నొకమారు హర్షమున నొందిమేమఱచు
నినుజూచివొకమారు నిలువెల్ల పులకించు
తనుజూచి వొకమారు తలపోసి నగును
కనుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపొసి యింతలో మఱచు
వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుడవునిను బాయ జాలదొకమారు
========================================================================================
% ఆకటి వేళల అలపైన వేళలను (వాల్యూం 1-158)
ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కుమరి లేదు
కొఱమాలియున్నవేళ కులముచెడినవేళ
చెరవడి వొరులచే జిక్కిన వేళల
వొరపైన హరినామ మొక్కటే గతిగాక
మరచి తప్పిననైన మఱిలేదు తెఱగు
ఆపదవచ్చినవేళ యారడిబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెఱగు
సంకెళ బెట్టిన వేళ చంపబలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతిగాక
మంకుబుద్ధి పొరలిన మరిలేదు తెఱగు
========================================================================================
% అదె చూడరే (వాల్యూం details not given in the book! )
అదె చూడరే మోహన రూపం
పది కోట్లుగల భావజ రూపం
వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం
ఇందిరా వనిత నెప్పుడు తన ఉర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కౌగిటి సొంపుల
విందులు మరగిన వేడుక రూపం
త్రిపురసతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీ వేంకటపతి యైయిల
ఉపమించగ రాని ఉన్నత రూపం
========================================================================================
% ప్రతిలేని పూజదలపంగ (వాల్యూం 12-300)
ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయె
మానినీమణిమనసు మంచియాసనమాయె
ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె
ఆనన సుధారసంబభిషేకమాయె
మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె
తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె
జగడంపుటలుకలుపచారంబులాయె
ననుపైన పొందులె నైవేద్య తతులాయె
తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు
వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె
========================================================================================
% మరలిమరలి జయమంగళము (వాల్యూం 1-448)
మరలి మరలి జయమంగళము
సొరిదినిచ్చలును శుభమంగళము
కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము
జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము
చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకౌగిటి
జొత్తుల రతులకు శుభమంగళము